Telugu

Fact Check: బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 'పాక్ ఆర్మీ కన్వాయ్‌'పై దాడి చేసిందా? కాదు, ఈ వీడియో యెమెన్‌దే

బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ఆర్మీ కన్వాయ్‌పై దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో యెమెన్‌కి చెందినదిగా తేలింది.

Ramesh M

హైదరాబాద్: యుద్ధభూమిని తలపించే మైదానంలో ఆర్మీ కన్వాయ్‌పై బాంబులు, తుపాకుల దాడులు జరుగుతున్న వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ దృశ్యాలను బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ఆర్మీపై చేసిన తాజా దాడిగా చూపుతూ ప్రచారం జరిగింది.

ఓ ‘X’ యూజర్ ఈ వీడియోను ఇలా పోస్టు చేశాడు –

"ఈ బెలూచిస్థాన్ వాళ్ళే పాకిస్తాన్ ని తుడిచి పెట్టేసేలా ఉన్నారుగా

లేటెస్ట్ దాడి మొత్తం కన్వెయ్ ని లేపి మింగారు

ఇదేదో వి.వి. వినాయక్ మూవీ అనుకునేరు" అంటూ వీడియోను షేర్ చేశాడు. (Archive లింక్)

వీడియోలో కన్వాయ్ ముందుకు సాగుతున్న సమయంలో ఎక్స్‌ప్లోషన్స్, ఫైరింగ్ జరుగుతుండటంతో ఇది నిజంగా జరిగిన దాడిలా కనిపిస్తోంది.

ఫ్యాక్ట్ చెక్

సౌత్ చెక్ పరిశీలనలో ఈ దావా తప్పుగా తేలింది. వైరల్ వీడియో BLA దాడి కాదని, యెమెన్‌లోని హౌతీ గ్రూప్ నిర్వహించిన సైనిక విన్యాసం (మిలిటరీ డ్రిల్) దృశ్యమని తేలింది.

వీడియోలోని ముఖ్యమైన కీఫ్రేమ్‌లను ఎంచుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో అక్టోబరు 15, 2024న ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయినదిగా గుర్తించాం. ఆ పోస్ట్‌లోనూ ఈ వీడియో యెమెన్‌కు సంబంధించి ఉన్నట్టు సూచన ఉంది.(Archive)

వీడియోలో ‘10.03.2024’ తేదీ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, మిడిల్ ఈస్టులో ప్రసారమయ్యే Al Araby TV లోగో కూడా ఉంది.

ఇంకా లోతుగా వెతికే ప్రయత్నంలో, Al Araby TV యూట్యూబ్ ఛానెల్‌లో ఏప్రిల్ 21, 2024న అప్‌లోడ్ చేసిన పూర్తి వీడియోను మేము గుర్తించాం. వీడియో టైటిల్‌ను అరబిక్ నుంచి అనువదించగా –

"చూడండి: హౌతీ గ్రూప్ ఇజ్రాయెల్ సైట్లు, అమెరికన్, బ్రిటిష్ బలగాలపై దాడులను అనుకరిస్తూ సైనిక విన్యాసాలు నిర్వహించింది" అని ఉంది.

ఈ వీడియోలో 3:13 నిమిషాల వద్ద వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాలే ఉన్నాయని స్పష్టంగా నిర్ధారించాం.

బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేసింది అన్నదీ అసత్యం. వైరల్ వీడియోలో కనిపించిన దృశ్యాలు యెమెన్‌లో హౌతీ గ్రూప్ నిర్వహించిన మిలిటరీ డ్రిల్‌కు సంబంధించినవే. దీంతో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పు అని తేలింది.

Fact Check: Elephant hurls guard who obstructed ritual in Tamil Nadu? No, here’s what happened

Fact Check: ശബരിമല മകരവിളക്ക് തെളിയിക്കുന്ന പഴയകാല ചിത്രമോ ഇത്? സത്യമറിയാം

Fact Check: இந்துக் கடவுளுக்கு தீபாராதனை காட்டினாரா அசாதுதீன் ஓவைசி? உண்மை அறிக

Fact Check: ಮೋದಿ ಸೋಲಿಗೆ ಅಸ್ಸಾಂನಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಬಾಂಗ್ಲಾದೇಶದ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: శ్రీలంక వరదల్లో ఏనుగు కుక్కని కాపాడుతున్న నిజమైన దృశ్యాలా? కాదు, ఇది AI-జనరేటెడ్ వీడియో