హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అక్టోబర్ 21, 2025న హైదరాబాద్ గోషామహల్‌లో జరిగిన పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు.
అయితే, ఈ సందర్భంలో సోషల్ మీడియాలో ఒక పత్రికా క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. అందులో సీఎం రేవంత్ రెడ్డి “ముస్లింలు మంత్రిపదవులు చేపట్టలేరు” అని అన్నారని పేర్కొంటూ పలు వ్యాఖ్యలను ఆయనకు ఆపాదించింది. అందులో కొన్ని ఈ విధంగా ఉన్నాయి:
“ముస్లిం సోదరులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి, వారికి పెద్ద పదవులు ఇవ్వలేను.”
“గతంలో కేసీఆర్ మహమ్మద్ అలీకి హెూమ్ శాఖ ఇస్తే సరిగ్గా హ్యాండిల్ చేయలేదు.”
“జనాభా లెక్కల ప్రకారం చూస్తే, ముస్లింలకు కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వకూడదు.”
“నా సహకారంతోనే అజహరుద్దీన్ లాంటి ముస్లింలు ఎమ్మెల్సీలు అవుతున్నారు.”
ఈ క్లిప్పింగ్‌ను ఒక ఫేస్‌బుక్ యూజర్ “పోలీస్ అమర వీరుల స్మారక సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు – ముస్లింలు మంత్రిపదవులు చేపట్టలేరు” అంటూ షేర్ చేశాడు. (ఆర్కైవ్ లింక్)
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ ను పరిశీలించగా, ఇది తప్పు అని తేలింది. పోలీస్ అమర వీరుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కీవర్డ్ సెర్చ్ ద్వారా అధికారిక I&PR తెలంగాణ యూట్యూబ్ ఛానెల్లో అక్టోబర్ 21, 2025న అప్‌లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాం.
వీడియో శీర్షిక,“గోషామహల్‌లోని పోలీసు అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పోలీసు జెండా దినోత్సవ కవాతులో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి.”
ఆ పూర్తి ప్రసంగాన్ని పరిశీలించగా, వైరల్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న వ్యాఖ్యలు ఎక్కడా లేవు. ఆయన ప్రసంగం మొత్తం పోలీసుల సేవల గొప్పతనం, త్యాగం, రాష్ట్ర భద్రత కోసం వారి కృషి, మావోయిస్టులకు శాంతి పిలుపు వంటి విషయాలపై మాత్రమే ఉంది.
ఇక FactCheck_Telangana అధికారిక హ్యాండిల్ కూడా ఎక్స్ లో ఈ పోస్టును ఫాక్ట్ చెక్ చేసింది. అందులో ఇలా పేర్కొన్నారు:
"🚨 నకిలీ హెచ్చరిక! 🚨
ముస్లింలు మంత్రి పదవులను నిర్వహించలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని తప్పుడు వాదనతో ఒక నకిలీ వార్తాపత్రిక క్లిప్పింగ్ ప్రచారంలో ఉంది. ⚠️
👉 ఈ ప్రకటన పూర్తిగా కల్పితం - ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
🗳️ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మధ్య, రాష్ట్రంలో శాంతి మరియు సామరస్యాన్ని దెబ్బతీసేందుకు అనేక మతపరమైన తప్పుడు సమాచారం పోస్ట్‌లు వ్యాప్తి చెందుతున్నాయి."
ప్రజలు ఇలాంటి పోస్టులను నమ్మకుండా, షేర్ చేసే ముందు సమాచారం నిర్ధారించుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి “ముస్లింలు మంత్రిపదవులు చేపట్టలేరు” అన్నారు అంటూ వైరల్ అవుతున్న న్యూస్‌పేపర్ క్లిప్పింగ్ నకిలీది. ఆయన పోలీస్ అమర వీరుల స్మారక దినోత్సవ ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అందువల్ల, ఈ క్లెయిమ్ తప్పు.