Telugu

Fact Check : 'ట్రంప్‌ను తన్నండి, ఇరాన్ చమురు కొనండి' ఒవైసీ వ్యాఖ్యలపై మోడీ, అమిత్ షా రియాక్షన్? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

'ట్రంప్‌ను తన్నండి, ఇరాన్ చమురు కొనండి' అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒవైసి ప్రసంగానికి ప్రధాని మోడీ, అమిత్ షా రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది.

Sherly

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ "ట్రంప్‌ను తన్నండి, ఇరాన్ నుండి చమురు కొనండి" అని పార్లమెంట్లో అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఒవైసి ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాల రియాక్షన్ కూడా ఈ వీడియో చూపిస్తోంది. 

ఈ వీడియో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో వైరల్ అవుతుండడం గమనార్హం.

ఈ వీడియోలో ఒవైసి మాట్లాడుతూ, ఇలా అన్నారు, "సర్, మీకు 56 అంగుళాల ఛాతీ ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు, మరి మీరు ట్రంప్‌కి ఎందుకు భయపడుతున్నారు? ట్రంప్‌ను తన్నండి, ఇరాన్ నుండి చమురు కొనండి…. భారత ప్రజలపై రూ. 2,500 కోట్ల భారం పడుతోంది…. మీరు ఇరాన్ నుండి చమురు కొనడం లేదు. ఇరాన్ నుండి అత్యంత చౌకైన చమురు దొరుకుతుంది. ఈ దేశానికి ఖచ్చితంగా రష్యా S400 క్షిపణి అవసరం... "

ఈ వీడియోపై, "ట్రంప్ అంటే ఎందుకు భయపడుతున్నారు?" అని హిందీలో రాసి ఉంది. ఈ వీడియోని యూట్యూబ్‌లో షేర్ చేశారు. (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)

Fact Check 

సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. ఒవైసి వ్యాఖ్యలు చేస్తున్న వీడియో 2019 నాటిది. ప్రధాని మోడీ, అమిత్ షాల చూపిస్తున్న వేర్వేరు వీడియోలను జోడించి వైరల్ వీడియోని తయారు చేశారు. 

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే AIMIM Xలో పోస్ట్ చేసిన వీడియో దొరికింది. ఈ వీడియోకి, వైరల్ వీడియోకి మధ్య సరిపోలికలు ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేసి, క్యాప్షన్‌లో ఇలా రాశారు, "2019 లోక్‌సభ ఎన్నికల తీర్పు మన దేశంలో పెరుగుతున్న మతపరమైన విభజనకు నిదర్శనం." (ఆర్కైవ్)

ఈ వీడియోలో ఒవైసి ఇరాన్, అమెరికా, ట్రంప్ గురించి ప్రస్తావించలేదు. అయితే రేడు వీడియోల మధ్య సరిపోలికలు ఉండడంతో, రెండు ఒకే రోజు చేసిన ప్రసంగంలో వీడియోలు అని తేలింది. X పోస్టులో ఉన్న వీడియో జూన్ 24, 2019 న లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిగిన రోజున ఒవైసి చేసిన ప్రసంగంలో భాగం. 

పార్లమెంట్ వీడియో లైబ్రరీలో జూన్ 24, 2019న ఒవైసి చేసిన ప్రసంగం పూర్తి వీడియో ఉంది. ఈ వీడియోలో, 54:10 నిమిషం మార్కు వద్ద అమెరికా గురించి ఒవైసి ప్రస్తావించినట్లు చూడగలం. వైరల్ వీడియోలో ఉన్న వీడియో క్లిప్ కూడా ఇదే దృశ్యాన్ని చూపిస్తుంది.

వీడియో ట్రాన్స్క్రిప్ట్ కూడా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చూపిస్తుంది. ఈ వ్యాఖ్యలను హైలైట్ చేసి చూపిస్తున్న చిత్రాన్ని చూడవచ్చు. 

ఒవైసి మాట్లాడుతుండగా ప్రధాన మంత్రి మోడీ లేదా హోం మంత్రి అమిత్ షాలను వీడియో చూపించడం లేదు. కాబట్టి వైరల్ వీడియోలోని ప్రధాన మంత్రి మోడీ చూపిస్తున్న క్లిప్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేసాం. అయితే ఈ వీడియో క్లిప్పులు ఒవైసి ప్రసంగం చేసిన రోజువి కావని తేలింది.

PTC News యూట్యూబ్‌లో ప్రచురించిన లైవ్ వీడియో దొరికింది. ఈ వీడియోలో ప్రధాని మోడీని చూపిస్తున్న దృశ్యాలకు, వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలకు మధ్య పోలికలు ఇక్కడ చూడవచ్చు.

ప్రధాని మోడీ రియాక్షన్ చూపిస్తున్న వీడియో క్లిప్ 2023 ఫిబ్రవరి 1న పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కు సంబంధించిన వీడియో. 

అమిత్ షా తెల్లటి చొక్కా మీద క్రీమ్ కలర్ కండువా ధరించి ఉన్న చిత్రం కోసం గూగుల్‌లో వెతికాం. ఆగష్టు 10, 2023లో ఇండియా బ్లూమ్స్ న్యూస్ సర్వీస్ ప్రచురించిన చిత్రాలు దొరికాయి. ఈ ఆధారాలు అనుసరించి కీ వర్డ్ సెర్చ్ చేయగా,  ఆగస్టు 10, 2023న అమిత్ షా పార్లమెంటులో ఉన్న దృశ్యాలను చూపిస్తున్న యూట్యూబ్ వీడియోను కనుగొన్నాం. 

ఈ వీడియోని అదే రోజున, సంసద్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌కి అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో క్లిప్‌లో అమిత్ షా వైరల్ వీడియోలో ధరించిన దుస్తులతో పాటు మరి కొన్ని సరిపోలికలు ఉన్నట్లు గమనించాం. కాబట్టి వైరల్ వీడియోలో అమిత్ షా ప్రతిచర్యను చూపించే వీడియో క్లిప్ కూడా ఒవైసీ ప్రసంగం చేసిన రోజు నాటిది కాదని స్పష్టమైంది.

కాబట్టి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్న వీడియో 2019 నాటిది, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ, అమిత్ షాల చూపిస్తున్న వేర్వేరు వీడియోలను జోడించి వైరల్ వీడియోని తయారు చేశారు. 

వైరల్ వీడియో ఎడిట్ చేయబడిన పాత వీడియో అని సౌత్ చెక్ నిర్ధారించింది.

Fact Check: Israeli building destroyed by Iranian drone? No, video is from Gaza

Fact Check: ಕಾರವಾರದಲ್ಲಿ ಬೀದಿ ದನಗಳಿಂದ ವ್ಯಕ್ತಿಯೋರ್ವನ ಮೇಲೆ ದಾಳಿ ಎಂದು ಮಹಾರಾಷ್ಟ್ರದ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: தாயின் கண் முன்னே மகனை தாக்கிய காவல்துறையினர்? இச்சம்பவம் திமுக ஆட்சியில் நடைபெற்றதா

Fact Check: സര്‍ക്കാര്‍ സ്കൂളില്‍ ഹജ്ജ് കര്‍മങ്ങള്‍ പരിശീലിപ്പിച്ചോ? വീഡിയോയുടെ വാസ്തവം

Fact Check: ஒருவரை இரண்டு மாடுகள் தாக்கியதாக வைரலாகும் காணொலி? தமிழ்நாட்டில் நடைபெற்றதா