Telugu

Fact Check: ‘బాంబు పరీక్ష’లో మదర్సా టీచర్, కుటుంబం మృతి? కాదు, వీడియోలో కనిపించింది సిలిండర్ పేలుడు

‘ప్రముఖ మదర్సా టీచర్’ అబ్దుల్ గఫార్ బాంబు పరీక్ష చేస్తుండగా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు మృతి చెందారని చెబుతూ ఒక పేలుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Southcheck Network

హైదరాబాద్: ఇళ్ల మధ్య ఉన్న ఓ వీధిలో భారీ పేలుడు సంభవించినట్లు చూపించే CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాంబు పరీక్షకు సంబంధించినదిగా పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వైరల్ వీడియోతో పాటు, ‘ప్రముఖ మదర్సా శాస్త్రవేత్త’ అబ్దుల్ గఫార్ ఇంట్లో ఈ పేలుడు జరిగిందని, ‘బాంబు పరీక్ష’ సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం మృతి చెందిందని కొందరు పేర్కొంటున్నారు.

ఓ ఫేస్‌బుక్ ఖాతా ఈ వీడియోను “గొప్ప మదర్సా శాస్త్రవేత్త అబ్దుల్ గఫార్ తన కుటుంబం మొత్తంతో 72 హుర్ల దగ్గర వెళ్ళిపోయాడు... ఇంట్లో సొంతంగా బాంబు తయారు చేసి దాన్ని పరీక్ష చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందట. నాగబాబు... నువ్వు పోయి నాలుగు బాంబులు నెస్ బట్టతల మీద వేసుకుపొ నీ బ్రేయజేన్ లెస్” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. (ఆర్కైవ్)

నిజంగానే ఇంట్లో బాంబు పరీక్ష జరిగిందా? చెక్ చేద్దాం

Fact Check

సౌత్ చెక్ పరిశీలనలో వైరల్ అవుతున్న వాదన తప్పని తేలింది. ఈ పేలుడు కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఆగస్టు 25న గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన LPG సిలిండర్ పేలుడు.

అబ్దుల్ గఫార్ అనే మదర్సా టీచర్ ఉన్నారా?

కీవర్డ్ సెర్చ్ ద్వారా ఇంట్లో బాంబు పరీక్ష చేస్తూ ‘మదర్సా టీచర్ అబ్దుల్ గఫార్’ మృతి చెందినట్లు ఎలాంటి వార్తా కథనాలు మాకు కనిపించలేదు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియో ఆగస్టు 28న ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినట్లు గుర్తించాం. అందులో, కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఓ ఇంట్లో LPG సిలిండర్ పేలిందని, గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ పేలుడుతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

అదే వీడియోను ఇదే తరహా సమాచారంతో మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా షేర్ చేసింది.

వైరల్ వీడియోను మీడియా లైసెన్సింగ్ ప్లాట్‌ఫామ్ Reuters Connectలో కూడా గుర్తించాం. Reuters వివరాల ప్రకారం, ఆగస్టు 25న గ్యాస్ లీకేజీ కారణంగా LPG సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ధార్వాడ్ పేలుడుపై వార్తా కథనాలు ఏమంటున్నాయి?

ఈ ఘటనకు సంబంధించి పలు కన్నడ వార్తా కథనాలను కూడా మేము గుర్తించాం.

Navasamaja ఆగస్టు 26న ఈ ఘటనపై కథనం ప్రచురించింది. వైరల్ వీడియోలోని స్క్రీన్‌షాట్‌ను కథనానికి కవర్ ఇమేజ్‌గా ఉపయోగించింది.

ధార్వాడ్‌లోని జన్నత్ నగర్‌లో ఈ ఘటన జరిగినట్లు కథనం పేర్కొంది. ఘటన సమయంలో రాజసభ్ నీరలకట్టి అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్నాడని, అకస్మాత్తుగా జరిగిన పేలుడులో అతడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని కథనం తెలిపింది.

Bharath Vaibhav, Newso News, Vishwavani వంటి ఇతర కన్నడ వార్తా సంస్థలు కూడా ఈ ఘటనపై కథనాలు ప్రచురించాయి. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తి రాజసభ్ నీరలకట్టేనని ఈ కథనాలు ధృవీకరిస్తున్నాయి.

పేలుడు తర్వాత స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని రాజసభ్‌ను బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన అతడిని KIMS ఆసుపత్రికి తరలించారు.

అందువల్ల వైరల్ వీడియో ‘మదర్సా టీచర్’ అబ్దుల్ గఫార్ ఇంట్లో బాంబు పరీక్ష చేస్తుండగా జరిగిన పేలుడును చూపించడం లేదని స్పష్టమవుతోంది. ధార్వాడ్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా LPG సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది.

కాబట్టి వైరల్ అవుతున్న వాదన తప్పు.

Fact Check: Video shows fire at Riyadh Airport after Houthi missile attack? No, video is unrelated

Fact Check: കൊല്‍ക്കത്തയില്‍ വിമാനത്താവളത്തിനായി മുസ്ലിം പള്ളി പൊളിക്കുന്ന ദൃശ്യങ്ങള്‍? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: அபிஜீத் தீப்கே அமைதியைக் காப்பதாகக் கூறி சட்டப்பூர்வமான பிணைப்பத்திரத்தில் கையெழுத்திட்டாரா? உண்மை அறிக

Fact Check: ಸಿಜೆಪಿ ಪ್ರತಿಭಟನೆಯಲ್ಲಿ ಸಿಖ್ ವೇಷ ಧರಿಸಿ ಸಿಕ್ಕಿಬಿದ್ದ ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿ? ಸುಳ್ಳು, ಸತ್ಯ ಇಲ್ಲಿದೆ

Fact Check: ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనా? కాదు, పాత వీడియో వైరల్