Telugu

Fact Check: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో పాకిస్తాన్ అనుకూల ర్యాలీ? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

కేరళకు చెందిన ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీలలో పాల్గొంటున్నట్లు క్లెయిమ్ చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Sherly

Hyderabad: కేరళలోని ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీలలో పాల్గొంటున్నారు అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి సందర్భంలో ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

వీడియోలో, తెల్ల చంద్రవంక గుర్తు ఉన్న ఆకుపచ్చ రంగు జెర్సీలు, జెండాలతో ర్యాలీలో నినాదాలు చేస్తున్న వ్యక్తుల గుంపును చూడవచ్చు.

ఈ వీడియోలో కనిపిస్తున్న ర్యాలీ పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ కు అనుకూలంగా జరిగిందని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వీడియోలో కనిపించే జెర్సీలు, జెండాలు పాకిస్తాన్ జాతీయ జెండాను పోలి ఉన్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు.

వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, క్యాప్షన్‌లో ఇలా రాశారు, “దేశవిద్రోహుల్ని రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తోంది! కేరళలో కొంతమంది ముస్లింలు పాకిస్తాన్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం సిగ్గుచేటు! ఇలాంటి చర్యలను కఠినంగా నిరోధించకపోతే, ఇవి దేశ భద్రతకు పెద్ద ప్రమాదంగా మారతాయి. భారతదేశం మీద ప్రేమ, గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ దేశద్రోహ చర్యలను ఖండించాలి. #PahalgamTerroristAttack #IndiaFirst” (ఆర్కైవ్)

ఇదే వీడియోని Xలో (గతంలో ట్విట్టర్) షేర్ చేసి ఇలా రాశారు “ఇది కేరళలోని కోజికోడ్. వారికి ముస్లిం లీగ్ అనే పార్టీ ఉంది, వారు పాకిస్తాన్ జెండాతో పాకిస్తాన్ క్రికెట్ జట్టులా దుస్తులు ధరిస్తారు. భారతదేశంలోనే శత్రువులు ఉన్నారు.” (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)

Fact Check

సౌత్ చెక్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో కేరళలో ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీని నిర్వహించడం లేదా పాకిస్తాన్ జెండాలను పట్టుకున్న వ్యక్తులను చూపించడం లేదు. ఏప్రిల్ 16న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కార్యకర్తలు పార్టీ జెండాను పట్టుకున్నట్లు ఇది చూపిస్తుంది.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో పాకిస్తాన్ అనుకూల ర్యాలీలు జరిగాయని చూపించే వార్తా కథనాలు దొరకలేదు.

వైరల్ వీడియో కీఫ్రేమ్‌లను పరిశీలించి చూస్తే, వీడియోలో వ్యక్తులు ధరించిన ఆకుపచ్చ జెర్సీలపై 'అరంగడి' అని వ్రాయబడి ఉందని కనుగొన్నాం. జెండాలు, జెర్సీలపై ఉన్న చంద్రవంక చిహ్నం కూడా పాకిస్తాన్ జాతీయ జెండాకు భిన్నంగా కనిపిస్తుంది. అలాగే, వైరల్ వీడియోలోని జెండాలో పాకిస్తాన్ జాతీయ జెండాపై కనిపించే తెల్లటి నిలువు గీత లేదు.

వైరల్ వీడియోలోని జెర్సీలు, జెండాలు పాకిస్తాన్ జాతీయ జెండాను పోలి ఉన్నవి కావని స్పష్టంగా తెలుస్తుంది.

వీడియోలో, IUML కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సాదిఖాలి షిహాబ్ తంగల్‌కు మద్దతుగా నినాదాలు చేయడం వినవచ్చు. వీడియోలో ఎక్కడా "పాకిస్తాన్" లేదా "పహల్గామ్" వంటి పదాలు వినిపించడం లేదు.

వీడియో కీఫ్రేమ్‌ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ ఉపయోగించి, 'arangadi_official_page' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అప్‌లోడ్ చేయబడిన అదే వైరల్ వీడియోను కనుగొన్నాం. ఈ వీడియో ఏప్రిల్ 16న 'కోజికోడ్' అనే శీర్షికతో అప్‌లోడ్ చేయబడింది. (ఆర్కైవ్)

అదే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, ఏప్రిల్ 15న సయ్యద్ సాదిఖాలి షిహాబ్ తంగల్ చిత్రంతో ఒక బ్యానర్ షేర్ చేయబడింది. ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3 గంటలకు కోజికోడ్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన నిర్వహిస్తున్నట్లు ఈ బ్యానర్ పేర్కొంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 4న 'ఐయుఎంఎల్ సామూహిక నిరసనలు చేపట్టనుంది, సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది' అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. "ఏప్రిల్ 16న కోజికోడ్‌లో జరగనున్న మెగా వక్ఫ్ రక్షణ ర్యాలీతో ప్రారంభించి దేశవ్యాప్తంగా వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించాలని IUML నిర్ణయించింది" అని ఈ కథనం పేర్కొంది.

ఏప్రిల్ 16న జరిగిన వక్ఫ్ చట్టం నిరసనపై మక్తూబ్ మీడియా అదే రోజు ప్రచురించిన కథనం 'కోజికోడ్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా IUML నిరసనలో లక్షల మంది చేరారు, నిర్వాహకులు 'భారతదేశంలో అతిపెద్ద నిరసన‌.'

ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కోజికోడ్‌లో జరిగిన ర్యాలీ నుండి అని IUML కాసర్‌గోడ్ యూనిట్ అధ్యక్షుడు అసిమ్ అరంగడి న్యూస్‌మీటర్‌తో ధృవీకరించారు. "ఇది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీ, కాసర్‌గోడ్ నుండి మేము దాదాపు 80 మంది పాల్గొన్నాం. ఈ వీడియో ఏప్రిల్ 16న కోజికోడ్‌లో జరిగిన ర్యాలీ రోజున రికార్డ్ చేయబడింది" అని అసిమ్ అన్నారు.

వైరల్ వీడియో ఏప్రిల్ 16న జరిగిన వక్ఫ్ సవరణ చట్టం నిరసన సందర్భంగా చిత్రీకరించబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీని నిర్వహించినట్లు చూపించడం లేదు. ర్యాలీలో, పాకిస్తాన్ జాతీయ జెండాలు, జెర్సీలను ఉపయోగించలేదు; IUML పార్టీ జెండాలను ఉపయోగించారు.

కాబట్టి, వైరల్ క్లెయిమ్స్ తప్పు అని సౌత్ చెక్ నిర్ధారించింది.

Fact Check: Pro-Palestine march in Kerala? No, video shows protest against toll booth

Fact Check: ഓണം ബംപറടിച്ച സ്ത്രീയുടെ ചിത്രം? സത്യമറിയാം

Fact Check: யோகி ஆதித்யநாத்தை ஆதரித்து தீப்பந்தத்துடன் பேரணி நடத்தினரா பொதுமக்கள்? உண்மை என்ன

Fact Check: Christian church vandalised in India? No, video is from Pakistan

Fact Check: ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 1 ಸಿನಿಮಾ ನೋಡಿ ರಶ್ಮಿಕಾ ರಿಯಾಕ್ಷನ್ ಎಂದು 2022ರ ವೀಡಿಯೊ ವೈರಲ್