Hyderabad: ఒక భారీ బుద్ధ విగ్రహం స్థాపన చేస్తున్న దృశ్యాలు, ఆ తరువాత ఆ విగ్రహాన్ని నౌకలో నీటిమీదుగా రవాణా చేస్తుండగా చూపించే వీడియో, 1992లో హుస్సేన్ సాగర్ వద్ద బుద్ధ విగ్రహం స్థాపనను చూపిస్తోందని క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి “1992కి వెనక్కి వెళ్లి, బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో ట్యాంక్ బండ్ వద్ద స్థాపించిన పాత రోజులను గుర్తు చేసుకోండి” అని క్యాప్షన్‌తో షేర్ చేశారు.
వీడియోపై ఇలా రాశారు “1992లో హైదరాబాద్‌లో బుద్ధ విగ్రహం స్థాపన”.
ఇవే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు
Fact Check
సౌత్ చెక్ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వైరల్ వీడియో కృత్రిమ మేధస్సు, అంటే ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడిందని తేలింది.
వీడియోలో ఉన్న తేడాలు
వీడియోని ఏఐ ద్వారా రూపొందించారు అని సూచించే అనేక విషయాలను గుర్తించాం, ట్రాఫిక్ నియమాలకు వ్యతిరేఖంగా తప్పు వైపు ప్రయాణించే వాహనాలు, వ్యక్తుల శరీర భాగాలు సరిగ్గా ఉండకపోవడం, అసహజ రీతిలో వీడియో కీ ఫ్రేమ్‌ల మధ్య పూర్తిగా అదృశ్యమయ్యే వ్యక్తులు లాంటివి చూడవచ్చు. ఈ వీడియోలో అనేక మంది వీక్షకులు విగ్రహం రవాణాను సెల్ ఫోన్‌లతో చిత్రీకరించడం చూడవచ్చు. 1992లో సెల్ ఫోన్‌లు లేవు.
వీడియో మూలం
ఈ వీడియో కీ ఫ్రేమ్‌ను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, సెప్టెంబర్ 7న అప్‌లోడ్ చేసిన “భారత్ FX” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి దారితీసింది.
ఆ అకౌంట్‌లో ఈ రీల్‌లోని చిత్రాలు, వీడియోలు పూర్తిగా ఏఐతో రూపొందించబడినవని స్పష్టంగా పేర్కొంది. ఈ పోస్ట్ ఎవరినీ నొప్పించాలన్నా, హానిచేయాలన్నా ఉద్దేశం లేదని, కేవలం వినోదం కోసం మాత్రమే చేశామని కూడా రాశారు.
అదే అకౌంట్‌లో ఏఐతో రూపొందించిన వీడియోలు కూడా ఉన్నాయి. వాటి క్యాప్షన్లలో కూడా ఏఐతో రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. అకౌంట్ బయో ప్రకారం, ఈ క్రియేటర్ VFX, సినిమా, యానిమేషన్‌లో నైపుణ్యం కలిగిన 3D డిజిటల్ ఆర్టిస్ట్, వీడియో ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్‌లో కూడా నిపుణుడు అని తెలుస్తోంది.
టూల్ ఫలితం
Deepfake-O-meter అనే ఏఐ-డిటెక్టర్‌తో ఈ వీడియోను పరిశీలించాం. అందులోని ఒక ఆల్గోరిథం ఈ కంటెంట్‌ను 100 శాతం ఖచ్చితత్వంతో ఏఐతో రూపొందించినదిగా గుర్తించగా, మరొక డిటెక్టర్ 95.1 శాతం ఖచ్చితత్వంతో ఏఐతో రూపొందించినదని గుర్తించింది.
1992లో బుద్ధ విగ్రహం హైదరాబాద్‌లో స్థాపించబడిందా?
ది న్యూస్ మినిట్ 2017లో ప్రచురించిన కథనం ప్రకారం, బుద్ధ విగ్రహం 1992లో విజయవంతంగా స్థాపించబడింది, అప్పటి నుండి నగరానికి గర్వకారణంగా ఉంది.
ఈ కథనంలో రవాణా చేసే సమయంలో విగ్రహం తలకిందులై హుస్సేన్ సాగర్ అడుగున రెండు సంవత్సరాలు తెలిపింది. అలాగే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న గౌతమ బుద్ధుని ప్రతిష్ఠాత్మక ఏకశిలా విగ్రహాన్ని ప్రసిద్ధ శిల్పి, భారతీయ ఆర్కిటెక్ట్ సత్తానాథ ముత్తయ్య గణపతి స్థపతి రూపొందించారని పేర్కొంది.
1990 ఏప్రిల్ 8న వాషింగ్టన్ పోస్ట్ కూడా, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ అడుగున ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం ఉందని. ఇది 50 అడుగుల పొడవు ఉన్న 440 టన్నుల గ్రానైట్ బుద్ధ విగ్రహం అని రాసింది.
బుద్ధ విగ్రహం హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో 1992లో స్థాపించబడింది. అయితే వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఏఐతో రూపొందించబడింది. కాబట్టి ఈ క్లెయిమ్ తప్పు అని సౌత్ చెక్ నిర్ధారించింది.