Fact Check: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోతి గీతాంజలి ఆత్మహత్యపై ప్రధాని మోదీ స్పందించారని వచ్చిన Way2News కథనం ఫేక్

గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. రాష్ట్ర హోంశాఖ అధికారులతో మాట్లాడి ఈ కేసును ముమ్మరం చేయాలని కేంద్ర ఉన్నతాధికారులను ఆదేశమిచ్చారంటూ ఓ కథనం ఆరోపించింది.
Fact Check: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోతి గీతాంజలి ఆత్మహత్యపై ప్రధాని మోదీ స్పందించారని వచ్చిన Way2News కథనం ఫేక్
Published on
2 min read

మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఆన్‌లైన్ వేధింపుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని గోతి గీతాంజలి దేవి ఆత్మహత్యకు పాల్పడింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఆమె తీవ్ర చర్య తీసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇప్పుడు ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్లేమ్ గేమ్ నడుస్తోంది.

దీనికి సంబంధించి Way2News పేరుతో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"గీతాంజలి మృతిపై ప్రధాని ఆరా!

తెనాలికి చెందిన గీతాంజలి(30) మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంశాఖ అధికారులతో మాట్లాడి ఈ కేసును ముమ్మరం చేయాలని కేంద్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో ఇలాంటి ఆన్లైన్ దాడులు ఎంతో ప్రమాదకరమని, వీటిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉండగా, జగనన్న ఇళ్ల పట్టా అందుకున్న గీతాంజలిపై టీడీపీ, జనసేన సోషల్ మీడియా తీవ్రంగా ట్రోల్ చేసి, ఆత్మహత్యకు ఉసిగల్పడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి" అంటూ ఓ కథనం పేర్కొంది.

నిజ నిర్ధారణ:

ఈ కథనం నకిలీదని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని సౌత్ చెక్ కనుగొంది.

'గీతాంజలి మృతిపై ప్రధాని ఆరా' అనే కీలక పదాలను ఉపయోగించి మేము కీవర్డ్ శోధన నిర్వహించినపుడు. గీతాంజలి మృతిపై మోదీ ఆరా తీసినట్లు ఏ వార్తా ఛానెల్ ప్రసారం లేదా వార్తా కథనం మాకు కనిపించలేదు.

కానీ, మేము ఈ వార్తా కథనాన్ని ఖండించిన Way2News ఫాక్ట్ చెక్ యొక్క అధికారిక ఖాతా ద్వారా X పై ఒక పోస్ట్‌ను కనుగొన్నాము.

"ఇది Way2News కథనం కాదు. కొంతమంది దుర్మార్గులు మెటాగ్రూప్‌లలో మా లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు మరియు అటాచ్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఇది Way2News ద్వారా ప్రచురించబడలేదని మేము ధృవీకరిస్తున్నాము" అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.

గీతాంజలి భర్త బాలచంద్ర ప్రకారం, గీతాంజలి, సోషల్ మీడియాలో హానికరమైన ట్రోలింగ్ కారణంగా, మార్చి 7న తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తున్న రైలు ముందు దూకి తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించింది. తీవ్ర గాయాలపాలైన ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 11న మృతి చెందింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, గీతాంజలి మార్చి 4న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దీంతో TDP, JSP మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు ఆమెను కించపరిచే పదజాలంతో ట్రోల్ చేశారు.

గుంటూరు ఎస్పీ తుషార్ దూది కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మృతురాలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే చట్టం ఎవరినీ శిక్షించకుండా వదిలిపెట్టదని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఆరోపణలను TDP, JSP నేతలు కొట్టిపారేస్తూ, రాజకీయ మైలేజ్ కోసం YSRCP సిగ్గులేకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గీతాంజలి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాని, గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీశారని, రాష్ట్ర హోంశాఖ అధికారులతో మాట్లాడి ఈ కేసును ముమ్మరం చేయాలని కేంద్ర ఉన్నతాధికారులను ఆదేశించారని వైరల్ వార్తా కథనంలోని వాదనలు అవాస్తవం

అందుకే, Way2News పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ఫేక్ మరియు తప్పుదారి పట్టించేదిని మేము నిర్ధారించాము.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in