
Hyderabad: ఇటీవల, భారతదేశ పొరుగు దేశమైన నేపాల్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ప్రధానమంత్రి ఉన్న కె.పి. శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో, బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానమంత్రి అయ్యారనే క్లెయిమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలేంద్ర షా కనిపిస్తున్న కొన్ని చిత్రాలను జోడించి ఉన్న పోస్టుపై ఇలా రాసి ఉంది, "నేపాల్ కొత్త ప్రధాని బాలేంద్ర షా బౌద్ధ్". ఈ ఫోటోని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు, "బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేకుండా... మొదటి సారి బౌద్ధుడు #బలేంద్ర షా బౌద్ధుడు నేపాల్ ప్రధానమంత్రి అయ్యాడు #JIA MULNIVASI". (ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. నేపాల్‌లో నిరసనల అనంతరం తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంపై అసంతృప్తితో నిరసనలు చెలరేగాయి. అది క్రమంగా అవినీతి, నిరుద్యోగం వంటి విస్తృత చర్చలకు దారి తీసింది. టీనేజర్లు, ఇరవైల వయస్సులో ఉన్న యువత (జెనరేషన్ జెడ్) బోర్డులు, నినాదాలతో వీధుల్లోకి దిగి, నిరసనలు చేసింది. ఈ నిరసనల్లో కనీసం 51 మంది మృతి చెందగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు.
నిరసనకారులు బారికేడ్లు కూలగొట్టడం, వ్యాపారాలను దోచుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ నాయకుల నివాసాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనికి ప్రతిగా భద్రతా దళాలు తుపాకీ గుండ్లు, టియర్ గ్యాస్, లాఠీలు వాడారు.
ప్రధానమంత్రి ఉన్న కె.పి. శర్మ ఓలి రాజీనామా చేశారు. నేపాల్‌లో అధికార ఖాళీ ఏర్పడింది. నిరసనలు నిర్వహించిన కార్యకర్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో కొన్ని రోజులుగా చర్చలు నిర్వహించి తాత్కాలిక ప్రధాన మంత్రిని ఎన్నుకున్నట్లు సమాచారం.
కీవర్డ్ సెర్చ్ ద్వారా ఈనాడు సెప్టెంబర్ 12న ప్రచురించిన కథనం దొరికింది. ఈ కథనం శీర్షిక, "నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం". ఈ కథనం ప్రకారం, "నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణం చేశారు."
అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సుశీల కర్కితో, సెప్టెంబర్ 12, రాత్రి 9.30 గంటలకు ప్రమాణం చేయించారు. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి రికార్డు సృష్టించిన కర్కి.. ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగానూ అరుదైన ఘనత సాధించారు. అని ఈనాడు కథనం పేర్కొంది.
సుశీల కర్కి ప్రమాణ స్వీకారం గురించి నమస్తే తెలంగాణ అదే రోజున "నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. ఎమర్జెన్సీ విధించే యోచన" అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనంలో "కొద్ది మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటుచేసిన కర్కి.. వెంటనే వారితో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. 2026 మార్చి 4న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు సమాచారం" అని పేర్కొంది.
పలు నివేదికల ప్రకారం నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా తర్వాత, నిరసనల్లో ముందు నిలచిన జనరేషన్-జెడ్ నాయకులు సోషల్ మీడియా ప్లాటుఫారం డిస్కార్డ్లో నిర్వహించిన పోల్లోనే సుశీలా కార్కిని ప్రధాని ఎన్నుకున్నారు అని ఎన్ టీవీ ప్రచురించిన నివేదిక పేర్కొంది.
35 ఏళ్ల బాలేంద్ర షా ప్రసిద్ధ మాజీ రాప్ సంగీతకారుడు, కాఠ్మాండూ మేయర్. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నేపాల్ యువత బాలేంద్ర షాకు మొగ్గు చూపింది.
ది కాఠ్మాండూ పోస్ట్ సెప్టెంబర్ 14న ప్రచురించిన కథనం ప్రకారం ప్రధానమంత్రి పదవికి అగ్రగామిగా పరిగణించబడిన బాలెన్ షా, కొత్త పరిపాలనకు నాయకత్వం వహించాలని జెనరేషన్ జెడ్ నాయకులు చేసిన పిలుపులకు స్పందించలేదు.
సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా ఉండడాన్ని బాలేంద్ర షా సమర్థిస్తూ సెప్టెంబర్ 10న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. "మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి, ఈ తాత్కాలిక/ఎన్నికల ప్రభుత్వానికి నాయకత్వం వహించాలనే మీ ప్రతిపాదనకు నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. మీ అవగాహన, జ్ఞానం మరియు ఐక్యతను నా హృదయం నుండి గౌరవించాలనుకుంటున్నాను. ఇది మీరు ఎంత పరిణతి చెందినవారో చూపిస్తుంది", అని జనరేషన్ జెడ్ ను ఉద్దేశింది రాశారు.
నేపాల్‌లో తాత్కాలిక ప్రధాని బాలేంద్ర షా కాదని తేలింది. ప్రస్తుతం ప్రధానమంత్రి వ్యవహరిస్తోంది సుశీల కర్కి.
కాబట్టి, సౌత్ చెక్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.