Fact Check: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలవడంతో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు రాష్ట్రం విడిచిపెడుతున్నారా? కాదు, ఇది మతపరమైన సమావేశం వీడియో

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ‘బంగ్లాదేశ్ చొరబాటుదారులు’ రాష్ట్రం విడిచిపెడుతున్నారంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది.
A video circulating online claims to show ‘Bangladeshi infiltrators’ leaving WB after the state polls.
Published on
2 min read

హైదరాబాద్: మే 4న జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత, బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులు రాష్ట్రం విడిచి వెళ్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో రోడ్డుపై వందలాది మంది కలిసి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి, పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే దిశగా వెళ్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు.

ఫేస్‌బుక్, X వంటి సోషల్ మీడియా వేదికల్లో పలువురు ఈ వీడియోను షేర్ చేస్తూ, “పశ్చిమ బెంగాల్లో బిజెపి గెలవడంతో, బెంగాల్ లోకి అక్రమంగా వలస వచ్చిన వేలాదిమంది బంగ్లాదేశ్ వలసదారులు తట్ట,బుట్ట చదురుకొని తిరుగు ప్రయాణం” అని పేర్కొన్నారు.(Archive)

ఫ్యాక్ట్ చెక్

సౌత్ చెక్ పరిశీలనలో ఈ క్లెయిం తప్పని తేలింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న వారు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు కాదు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక ఇస్లామిక్ మతపరమైన సమావేశానికి హాజరైన ముస్లింలు.

వీడియో విశ్లేషణ

వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో జనవరి 2026 నాటిదని తెలిసింది.

‘Dip Ghosh’ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను జనవరి 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ, ఇది “బిశ్వ ఇజ్తెమా 2026” సందర్భంగా తీసిన దృశ్యాలని పేర్కొన్నారు.

వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ, “ఇంతమంది కలిసి ఉండటం ఎప్పుడైనా చూశారా? మొత్తం ప్రాంతం హై అలర్ట్‌లో ఉంది. మూడు రోజులుగా ఇలాగే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ముస్లింలు ఇక్కడికి వచ్చారు. ఇది హూగ్లీ జిల్లాలోని పుయినాన్ ప్రాంతం” అని చెప్పాడు.

ఈ వీడియో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకంటే ముందే సోషల్ మీడియాలో పోస్టు చేయబడింది. కాబట్టి దీనికి ఎన్నికల ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదు.

బిశ్వ ఇజ్తెమా అంటే ఏమిటి?

బిశ్వ ఇజ్తెమా అనేది తబ్లీఘీ జమాత్ నిర్వహించే భారీ ఇస్లామిక్ మతపరమైన సమావేశం. ఇందులో ప్రార్థనలు, మత బోధనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ముస్లింలు హాజరవుతారు.

జనవరి 3న ప్రచురితమైన ది స్టేట్స్‌మన్ కథనం ప్రకారం, బిశ్వ ఇజ్తెమా 2026 జనవరి 2 నుంచి 5 వరకు పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా దాద్‌పూర్ పరిధిలోని పుయినాన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి లక్షలాది మంది హాజరైనట్లు నివేదిక పేర్కొంది.

వైరల్ వీడియోలో కూడా ఆ వ్యక్తి పుయినాన్ ప్రాంతం గురించే ప్రస్తావించాడు. వీడియోలో ఎక్కడా బీజేపీ విజయం లేదా పశ్చిమ బెంగాల్ ఎన్నికల గురించి ప్రస్తావించలేదు.

అసలు వీడియోను ఎలాంటి మార్పులు చేయకుండా సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ, దాన్ని “బంగ్లాదేశ్ చొరబాటుదారులు రాష్ట్రం విడిచి వెళ్తున్నారు” అంటూ తప్పుగా ప్రచారం చేశారు.

అందువల్ల, ఈ క్లెయిం తప్పు.

logo
South Check
southcheck.in