
Hyderabad: పశ్చిమ బెంగాల్‌లో హిందూ బాలుడిపై జరిగిన దాడిని చూపిస్తుందని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి, పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ సందర్భంలో, వైరల్ వీడియోను షేర్ చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న నిరసనల్లో హిందూ బాలుడిపై ఒక మూక దాడి చేసినట్లు చూపిస్తూ షేర్ చేశారు.
"పార్లమెంట్లో పెట్టిన వక్ఫ్ బిలుకు ఈ అమాయకపు హిందూ బాలుడికి ఏమయినా సంబంధం ఉందా హింస ఏ మతం వాడు చేసినా హింసే, కొన్ని సంఘటనలు పై మాత్రమే ప్రతిధ్వనించే సెక్యులర్ లౌకిక వాద కవి మేధావుల ఖలాలుమూగబోయాయ పనిచేయటం మానేశాయా లేక బిజెపి పాలిత రాష్ట్రాల్లో హింస మాత్రమే ఆ కళాలకు కనిపిస్తుందా హింస ఎక్కడ జరిగినా హింసేవెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ మారణకాండ కు మన దగ్గర ఏదైనా సమాధానం ఉందా?" అని క్యాప్షన్‌లో రాశారు.
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో అత్యాచార నిందితుడైన యువకుడిపై ఒక గుంపు దాడి చేస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.
వైరల్ వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఒక దళిత బాలుడిపై జరిగిన దాడికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు లేదా విశ్వసనీయ సోషల్ మీడియా పోస్ట్‌లు మాకు కనిపించలేదు.
వీడియో కీఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మార్చి 19, 2025న ప్రచురించబడిన Somoy TV కథనం దొరికింది. వైరల్ వీడియో స్క్రీన్‌షాట్ ఈ కథనంలో ఉపయోగించబడింది. ఈ కథనం శీర్షిక ‘పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం, అత్యాచార నిందితుడిని గుంపు కిడ్నాప్ చేసి దాడి చేశారు’. (బెంగాలీ నుండి అనువదింపబడింది)
వైరల్ వీడియో స్క్రీన్‌షాట్, కథనంలో ఉపయోగించిన చిత్రం పోలికలను క్రింద చూడవచ్చు.
Somoy TV కథనం ప్రకారం, మార్చి 18, 2025న, బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఖిల్‌ఖేట్‌లో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, ఆగ్రహంలో ఒక గుంపు పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుంది, నిందితుడిని బైటికి లాగి, అతని పై దాడి చేశారు.
కీవర్డ్ సెర్చ్ ద్వారా మార్చి 19, 2025న Jamuna TV పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోను కనుగొన్నాం. ఆ వీడియోను ‘చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిపై గుంపు దాడి చేసింది; ఖిల్‌ఖేట్‌లో ఏం జరిగింది? | ఖిల్‌ఖేట్ అత్యాచారం’ (బెంగాలీ నుండి అనువదింపబడింది) అనే శీర్షికతో పోస్ట్ చేయబడింది.
ఖిల్‌ఖేట్‌లో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై ఒక గుంపు దాడి చేసిందని వీడియో వివరణలో పేర్కొంది.
ఈ సంఘటనపై Daily Star కథనం మార్చి 19, 2025న ‘ఖిల్‌ఖేట్‌లో అత్యాచారం చేసిన నిందితుడిపై, పోలీసులపై దాడి జరిగింది’ అనే శీర్షికతో ప్రచురించబడింది. ఆ యువకుడిపై దాడి మార్చి 18, 2025న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఖిల్‌ఖేట్ బజార్‌లో జరిగిందని ఈ కథనం పేర్కొంది.
“స్థానికులు అత్యాచార ఆరోపణలపై ఒక యువకుడిని కొడుతున్నారనే సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లామని ఖిల్‌ఖేట్ పోలీసులు తెలిపారు. టీనేజర్‌ను పోలీసు వ్యాన్‌లోకి తీసుకెళ్లినప్పుడు, 100 మందికి పైగా వ్యక్తులు పోలీసు వాహనాన్ని దాడి చేసి ధ్వంసం చేశారు," అని రాశారు.
Dhaka Tribune, Business Standard, Protomolo, Potheprantore కూడా ఖిల్‌ఖేట్‌లో అత్యాచార నిందితుడైన యువకుడిపై జరిగిన దాడిపై కథనాలను ప్రచురించాయి.
మార్చి 18, 2025న బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఖిల్‌ఖేట్ ప్రాంతంలో అత్యాచార నిందితుడైన యువకుడిపై ఒక గుంపు దాడి చేస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. ఇది పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనల్లో చోటుచేసుకున్న హింసా కాండలో హిందూ బాలుడిపై జరిగిన దాడిని చూపించడం లేదు.
కాబట్టి, సౌత్ చెక్ వైరల్ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.