

వీక్షకులకు సూచన: ఈ వీడియోలో హింసకు సంబంధించిన గ్రాఫిక్, కలవరపరిచే దృశ్యాలు ఉన్నాయి.
Hyderabad: ఒక వ్యక్తి మహిళపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో బంగ్లాదేశ్‌లో ఓ ముస్లిం వ్యక్తి హిందూ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను చూపిస్తోందంటూ పోస్టులు ప్రచారం చేస్తున్నాయి.
వైరల్ పోస్టుల్లో తెల్ల చొక్కా ధరించిన వ్యక్తిని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సభ్యుడు మసూద్ అలీ ఖందాకర్గా అని పేర్కొన్నారు. అలాగే, లేత రంగు అంచుతో కూడిన ముదురు రంగు చీర ధరించిన మహిళను లతా దేబ్‌నాథ్ అనే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా గుర్తించారు.
ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని బోగ్రాలో జరిగిందని పోస్టులు పేర్కొంటున్నాయి.
ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి ఇలా రాశారు, “బంగ్లాదేశ్‌లోని బోగురాలో, బీఎన్‌పీ సభ్యుడు "మసూద్ అలీ ఖండేకర్" "హిందూ"ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు "లతా దేబ్‌నాథ్" పై అత్యాచారం చేసి, దారుణంగా హింసించి, చంపాడు.. "(ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిగా తేలింది. ఈ వీడియో స్క్రిప్టెడ్ వీడియో.
ముందుగా వైరల్ పోస్టుల్లో పేర్కొన్న వివరాల ఆధారంగా కీవర్డ్ సెర్చ్‌లు నిర్వహించాం. ఈ వీడియోకు బంగ్లాదేశ్‌లోని బోగ్రాలో జరిగినట్లు చెబుతున్న అత్యాచారం లేదా హత్య ఘటనకు సంబంధం ఉందని నిర్ధారించే విశ్వసనీయ వార్తా కథనాలు లేదా నమ్మదగిన సోషల్ మీడియా పోస్టులు మాకు లభించలేదు.
ఆ తర్వాత వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. ఈ సెర్చ్ ద్వారా ఇదే వీడియోకు సంబంధించిన మరింత పొడవైన, క్రాప్ చేయని వెర్షన్ లభించింది. దీనిని ‘vipin_chauhan28’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆగస్టు 11న పోస్ట్ చేసింది.
ఆ వీడియోపై హిందీలో ఇలా రాసి ఉంది “ఈ ఇద్దరూ WWEని కూడా మించిపోయారు. నిజంగా WWEకి వెళ్లే వరకు వీళ్లు ఆగేలా కనిపించడం లేదు.”
ఈ పొడవైన వీడియో మరింత ముఖ్యమైన సందర్భాన్ని అందిస్తుంది. వీడియో ప్రారంభంలోనే ఆ వ్యక్తి, మహిళ ఒకరితో ఒకరు గొడవపడటం కనిపిస్తుంది. వారు ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం, నేలపై పడేయడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 12 సెకన్ల క్లిప్ ఈ పొడవైన వీడియోలో మధ్య భాగంలో ఉంది.
వీడియోతో పాటు ఉన్న క్యాప్షన్‌లో కూడా WWE, యాక్టింగ్, స్టేజ్డ్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఇది నిజమైన దాడికి సంబంధించిన వీడియో కాకుండా వినోదం కోసం రూపొందించిన వీడియో అని సూచిస్తోంది.
పోస్ట్‌కు సంబంధించిన క్యాప్షన్ ఇలా ఉంది, “అద్భుతమైన ప్రతిభ... ప్రస్తుతం వారు ఒంటరిగా నిలిచినా, ఒక రోజు WWEలో సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు... మీ మద్దతుకు ధన్యవాదాలు #Wwe #aew #acting #viral #reality”
వైరల్ క్లిప్‌లోని కీలక ఫ్రేమ్‌లను అసలు వీడియోలోని ఫ్రేమ్‌లతో పోల్చగా, రెండూ అదే వీడియోకు చెందిన దృశ్యాలని నిర్ధారించాం.
అదే ఖాతా దీనిని “ప్లాన్డ్ వీడియో”గా పేర్కొంది
ఇదే వీడియోకు సంబంధించిన మరో వెర్షన్‌ను సెప్టెంబర్ 4న అదే ఖాతా పోస్ట్ చేసినట్లు గుర్తించాం.
ఈ పోస్టులో వైరల్ అవుతున్న వీడియో వెనుక ఉన్న “నిజం” ఏమిటని ప్రేక్షకులను ప్రశ్నిస్తూ, దీనిని “planed video”గా పేర్కొన్నారు. ఇందులో #wwe, #reality, #acting వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పాటు, వీడియోలో చూపిన చర్యలను ప్రయత్నించవద్దని హెచ్చరిక కూడా ఉంది.
ఆగస్టు 9న చేసిన ఓ పాత పోస్టులో కూడా ఇదే వీడియోను షేర్ చేశారు.
ఆ పోస్టులో మహిళను రుచికా షాగా పేర్కొన్నారు. ఇది వైరల్ క్లెయిమ్‌లో ఆమెను లతా దేబ్‌నాథ్గా పేర్కొన్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
వివిధ పోస్టుల్లో అదే మహిళకు వేర్వేరు పేర్లు ఆపాదించడం ద్వారా కూడా వైరల్ క్లెయిమ్ వీడియోకు తప్పుడు గుర్తింపు, సందర్భాన్ని జోడించిందని స్పష్టమవుతోంది.
ఆ ఖాతాలో ఇలాంటి వీడియోలు మరెన్నో ఉన్నాయి
vipin_chauhan28 ఖాతాలోని ఇతర వీడియోలను కూడా పరిశీలించాం. అందులో ఇదే వ్యక్తి, మహిళ కలిసి నటించిన ఇలాంటి పలు క్లిప్‌లు కనిపించాయి.
ఈ వీడియోల్లో వారు స్టేజ్డ్ ఫైట్స్ చేస్తున్నట్లు కనిపిస్తుండగా, వాటితో పాటు నాటకీయ క్యాప్షన్లు, WWEకి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.
విపిన్ చౌహన్ అప్‌లోడ్ చేసిన ఇతర వీడియోలను పరిశీలించినా ఇదే విషయం మరింత స్పష్టమైంది. అనేక వీడియోల్లో అతను ఇదే మహిళతో కలిసి ఫైట్ చేస్తున్న దృశ్యాలను నాటకీయ క్యాప్షన్లతో పోస్ట్ చేశాడు.
ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని ఖాతా వివరాలను పరిశీలించగా, ఈ ఖాతా భారత్‌కు చెందినదని గుర్తించాం.
సౌత్ చెక్ తో మాట్లాడిన విపిన్ చౌహన్ ఈ వీడియో స్క్రిప్టెడ్ అని ధృవీకరించాడు.
అందువల్ల, ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని బోగ్రాలో ఓ ముస్లిం బీఎన్‌పీ సభ్యుడు హిందూ పాఠశాల ఉపాధ్యాయురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనకు సంబంధించినది కాదు. ఈ దృశ్యాలు భారత్‌కు చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసిన స్క్రిప్టెడ్ వీడియో నుంచి తీసుకున్నవి.