
Hyderabad: ఇంట్లోకి చొరబడి పూజ చేసుకుంటున్న పూజారిపై దాడికి పాల్పడిన ఘటన చూపిస్తోంది అనే క్లెయిమ్‌లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక ఇంట్లో జరిగిన ఘర్షణను చూపించే ఈ వీడియో మతపరమైన వాదనలతో షేర్ చేయబడుతోంది.
ఫేస్‌బుక్‌లో వీడియోను షేర్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాశారు, "*తన ఇంట్లో పూజ చేసుకుంటున్న పూజారి ఇంట్లోకి వచ్చి మరీ జిహాదీల దాడి...* *దీపారాధన గంటల శబ్దం తమకు వినపడకూడదు అని దాడి చేసిన వైనం..ఇది జరిగింది హైదరాబాద్లో..*" (ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వైరల్ వీడియోలో ఉన్నది వడ్డీ వ్యాపారి, అనుచరులు డబ్బులు చెల్లించనందుకు ఒక వ్యక్తిపై దాడి చేసిన ఘటన. ఇందులో మతపరమైన కోణం లేదు.
వీడియో కీ వర్డ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోని జూలై 27న X లో షేర్ చేసినట్లు కనుగొన్నాం. ఈ వీడియో క్యాప్షన్‌లో "మంత్రి @satyakumar_y నియోజకవర్గంలో దారుణం. ధర్మవరం నియోజకవర్గంలో రెచ్చిపోయిన వడ్డీ వ్యాపారులు.. అప్పు తిరిగి చెల్లించలేదని దంపతులపై దాడి. పిల్లలు అరుపులు పెడుతున్నా వదలకుండా కాళ్లతో తన్నుతూ అత్యంత దారుణంగా దాడి".
మరొక X పోస్టులో కూడా వైరల్ వీడియోని షేర్ చేస్తూ ఇలా రాశారు, "ధర్మవరం పట్టణంలో రెచ్చిపోయిన అధిక వడ్డీ వ్యాపారులు.. అప్పు తిరిగి చెల్లించలేదని దంపతులపై దాడి. పిల్లలు, భార్య అరుస్తూ వదిలి పెట్టమని బ్రతిమలాడుతున్న వదలకుండా కాళ్లతో తన్నుతూ అత్యంత దారుణంగా దాడి అధిక వడ్డీ వ్యాపారులు."
ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ, NTV, Mahaa News కూడా యూట్యూబ్‌లో కథనాలు ప్రసారం చేశాయి.
ఈ నివేదికల ప్రకారం, శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో పట్టు చీరల వ్యాపారి రమణ, అతని కుటుంబపై వడ్డీ వ్యాపారి అనుచరుల ముఠా దాడి చేసింది. రమణ తన వ్యాపారం కోసం వారానికి రూ. 10 వడ్డీకి ఎర్రగుంట రాజా నుండి రూ. 6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. మూడు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో రాజా తన అనుచరులను రమణ ఇంటికి పంపాడు.
వారు ఇంట్లోకి ప్రవేశించి రమణ, అతని భార్య భారతిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారి 12 ఏళ్ల కుమారుడు చరణ్ సాయి కూడా దాడి చేసి కొట్టారు.
ఈ ఘటనలో వారందరూ ఒకే సమాజానికి చెందినవారని తెలుస్తోంది. మీడియా కథనాలు కూడా ఘర్షణకు ఎటువంటి మతపరమైన కోణాన్ని ప్రస్తావించలేదు.
కాబట్టి, వీడియో గురించి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ నిజం కాదని సౌత్ చెక్ నిర్ధారించింది.