Fact Check: విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు నాయుడు మాట్లాడిన వీడియో ఎడిట్ చేయబడింది

Fact Check: విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు నాయుడు మాట్లాడిన వీడియో ఎడిట్ చేయబడింది

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రా యూనివర్సిటీలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో NDA కూటమి, YSRCPలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విద్య గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో, "విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పోరేట్‌లే ఆ బాధ్యత తీసుకోవాలి" అని చంద్రబాబు నాయుడు అన్నట్టు తెలుస్తుంది.

చంద్రబాబు వస్తే ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ పాడవుతాయి, విజ్ఞతతో ఓటు వేయండి అనే క్యాప్షన్‌తో ఓ ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.

వైరల్ వీడియో స్క్రీన్ షాట్
వైరల్ వీడియో స్క్రీన్ షాట్

నిజ నిర్ధారణ:

చంద్రబాబు నాయుడు ఆంధ్రా యూనివర్సిటీలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సౌత్ చెక్‌ కనుగొంది.

మేము వైరల్ వీడియోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో యూట్యూబ్‌లో కనిపించింది.

యూట్యూబ్‌లోని పూర్తి  వీడియో ఫుటేజీని విశ్లేషించిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  2015లో ఆంధ్రా యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించినదిగా తెలిసింది.

ఐతే ఈ ప్రసంగంలో ఒక సందర్భంలో టైమ్‌స్టాంప్ 21:21 ఆయన మాట్లాడుతూ ‘విద్య అనేది ఒక్క ప్రభుత్వ బాధ్యత కాదు…ప్రభుత్వం చేయాలి…దాతలు ముందుకు రావాలి…మీరు కూడా మీ భుజస్కంధాలపైన ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెంచే బాధ్యత తీసుకుంటే…సజావుగా జరుగుతుంది’  అని వ్యాఖ్యానించారు.

ఐతే ఈ వ్యాఖ్యల ప్రారంభంలో ఆయన వాడిన ‘ఒక్క’ అనే పదాన్ని తీసేసి ‘విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు’ అని ఆయన అన్నట్టు ఎడిట్ చేశారు. దీన్నిబట్టి వైరల్ పోస్టులో చంద్రబాబుకు ఆపాదిస్తున్న వ్యాఖ్యలు ఆయన చేయలేదని స్పష్టమవుతుంది.

అందుకే, 'విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు' అని చంద్రబాబు నాయుడు చెప్పిన వైరల్ వీడియో ఎడిట్ చేయబడిందని మేము నిర్ధారించాము.

logo
South Check
southcheck.in