

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి బాగ్‌పత్‌లోని తన స్వగ్రామంలో కాల్పులకు గురైన రాష్ట్రపతి భద్రతా సిబ్బంది సౌరభ్ తోమర్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
దీపావళి రాత్రి బాణసంచా కాల్చే విషయంలో జరిగిన వాగ్వాదం కాల్పులకు దారితీసినట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా గోపాల్‌పూర్ ఖదానా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు తన సోదరులతో కలిసి బాణసంచా కాల్చుతున్న సమయంలో సౌరభ్ తోమర్‌కు ప్రవీణ్ అనే పొరుగువ్యక్తితో వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఓ ఫేస్‌బుక్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ, రాష్ట్రపతి భద్రతా విధుల్లో ఉన్న 26 ఏళ్ల సౌరభ్ తోమర్‌ను పొరుగువ్యక్తి కాల్చాడని పేర్కొన్నారు. దీపావళి రాత్రి బాణసంచా కాల్చుతుండగా జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చిందని, నిందితుడు తుపాకీతో కాల్పులు జరపగా బుల్లెట్ గోడకు తగిలి తిరిగి వచ్చి సౌరభ్ తలలోకి దూసుకెళ్లిందని ఆ పోస్టులో ఆరోపించారు. (ఆర్కైవ్)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఫొటోలో ఉన్న వ్యక్తి బాగ్‌పత్‌లో కాల్పులకు గురైన సౌరభ్ తోమరేనా? ఈ ప్రచారంలో నిజమెంత? పరిశీలిద్దాం.
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని గుర్తించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఫొటోలో ఉన్న వ్యక్తి సౌరభ్ తోమర్ కాదు. ఆయన పేరు సౌరభ్ ఎస్. నాయర్. రాష్ట్రపతికి ADC (Aide-de-Camp)గా పనిచేస్తున్నారు. బాగ్‌పత్ ఘటనలో గాయపడిన వ్యక్తితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.
వైరల్ ఫొటో ఎక్కడిది?
వైరల్ పోస్టులోని ఫొటో నిజానిజాలు తెలుసుకునేందుకు ముందుగా గూగుల్ లెన్స్ ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దీంతో అదే ఫొటో రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించింది.
ఆ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఈ ఫొటో 2025లో రాష్ట్రపతి భవన్‌లో క్రీడా సదుపాయాల ప్రారంభోత్సవం సందర్భంగా తీసింది. ఇందులో స్కేటింగ్ రింక్, బాస్కెట్‌బాల్ కోర్టు, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
అంటే, బాగ్‌పత్ ఘటనకు ముందే ఈ ఫొటో తీసినట్లు స్పష్టమవుతోంది. ఇందులో ఉన్న వ్యక్తి కాల్పులకు గురైన సౌరభ్ తోమర్ కాదు.
బాగ్‌పత్ పోలీసులు ఏమన్నారు?
మా పరిశీలనలో నవంబర్ 11న బాగ్‌పత్ పోలీసుల అధికారిక X ఖాతాలో చేసిన ఓ పోస్టు కూడా కనిపించింది. ఈ ఫొటోపై వచ్చిన ప్రచారాన్ని పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేసి, అది తప్పుదోవ పట్టించే విధంగా ఉందని స్పష్టం చేశారు.
“రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉన్న ఓ వ్యక్తి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాగ్‌పత్‌లో జరిగిన ఘర్షణలో కాల్పులకు గురైన సౌరభ్ తోమర్ ఫొటో అంటూ దీనిని షేర్ చేస్తున్నారు. బాగ్‌పత్ పోలీసులు నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేదిగా తేలింది” అని పోలీసులు పేర్కొన్నారు.
“వైరల్ ఫొటో 2025లో తీసింది. ఇందులో రాష్ట్రపతితో కనిపిస్తున్న వ్యక్తి సౌరభ్ ఎస్. నాయర్. ఆయన రాష్ట్రపతికి ADC (Aide-de-Camp)గా ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. బాగ్‌పత్ ఘటనలో గాయపడిన సౌరభ్ తోమర్ ఫొటో ఇది కాదు” అని పోలీసులు స్పష్టం చేశారు.
బాగ్‌పత్‌లో గాయపడిన వ్యక్తి ఎవరు?
మరింత సమాచారం కోసం బాగ్‌పత్ పోలీసుల X ఖాతాను పరిశీలించగా, సౌరభ్ తోమర్ మాట్లాడుతున్న వీడియోకనిపించింది. ఈ వీడియోలో తనకు జరిగిన ఘటన గురించి ఆయన వివరించారు.
అలాగే, నవంబర్ 11న ప్రచురించిన UP Tak యూట్యూబ్ నివేదిక కూడా లభించింది. రాష్ట్రపతి భద్రతా విధుల్లో ఉన్న వ్యక్తిపై బాణసంచా కాల్చే విషయంలో జరిగిన వాగ్వాదం సందర్భంగా కొందరు కాల్పులు జరిపినట్లు ఈ కథనం పేర్కొంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు కూడా నివేదికలో తెలిపారు.
ఈ నివేదిక బాగ్‌పత్‌లో గాయపడిన సౌరభ్ తోమర్‌కు సంబంధించినదే. రాష్ట్రపతి ముర్ముతో ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం లేదు.
కాబట్టి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఫొటోలో ఉన్న వ్యక్తే బాగ్‌పత్‌లో కాల్పులకు గురైన సౌరభ్ తోమర్ అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఫొటోలో ఉన్నది రాష్ట్రపతికి ADCగా పనిచేస్తున్న సౌరభ్ ఎస్. నాయర్. బాగ్‌పత్ ఘటనలో గాయపడింది సౌరభ్ తోమర్.