
Hyderabad: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక్కో ఎమ్మెల్యేకు వెయ్యి కోట్లు ఆఫర్ చేస్తున్నారని పేర్కొంటున్న వార్త క్లిప్పింగ్ ఒకటి వైరల్ అవుతోంది.
"కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వెయ్యి కోట్లు ఇస్తా, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు అప్పగిస్తా. 40 మంది ఇటు వస్తే చాలు 48 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపిస్తా... ఈ-రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు ఆగే పరిస్థితి లేకపోవడంతో ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై గురి," అని వైరల్ అవుతోన్న వార్త క్లిప్పింగ్ పేర్కొంది.
న్యూస్ క్లిప్పింగ్ పై తెలంగాణ న్యూస్ టుడే లోగో, లింక్ ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఈ క్లిప్పింగ్ అప్లోడ్ చేయబడింది. (ఆర్కైవ్)
Fact Check:
ఈ వాదన తప్పు అని కనుగొన్నాం. ఈ వార్తా సంస్థ ఉనికిలో లేదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి కేసీఆర్ వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పినట్లు చూపించే వార్తలేవీ కనిపించలేదు.
తెలంగాణ న్యూస్ టుడే అనే పత్రిక ప్రచురించినట్లు కనిపిస్తున్న వార్త క్లిప్పింగ్ కోసం వెతకాము. అయితే, తెలంగాణ న్యూస్ టుడే అనే సంస్థ ఉనికిలోనే లేదని తేలింది.
న్యూస్ క్లిప్పింగ్ బ్యానర్‌పై ఉన్న లింక్ మనుగడలో లేదు. గూగుల్, బింగ్‌లో వివిధ కీవర్డ్ శోధనలు నిర్వహించి, తెలంగాణ న్యూస్ టుడే డైలీ ఈ-పేపర్ లేదా దాని వెబ్‌సైట్ ఎక్కడా లేదని కనుగొన్నాము.
telangananewstodaydaily డొమైన్ ఇంకా నమోదు కాలేదని కూడా కనుగొన్నాము.
భారతదేశ వార్తాపత్రికల రిజిస్ట్రార్ కార్యాలయ వెబ్‌సైట్‌లో 'తెలంగాణ న్యూస్ టుడే', 'తెలంగాణ న్యూస్ టుడే డైలీ' అనే పేరుతో రిజిస్టర్ అయిన వార్త సంస్థల కోసం శోధించాము. ఈ శీర్షికలతో ఏ వార్త సంస్థ కూడా నమోదు కాలేదని కనుగొన్నాము.
ఈ వార్త క్లిప్పింగ్, దాన్ని ప్రచురించినట్లు కనిపిస్తున్న తెలంగాణ న్యూస్ టుడే డైలీ అనే సంస్థ రెండూ కల్పితమేనని తేలింది.
కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించాము.