

Hyderabad: ఒక వ్యక్తి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత, కే చంద్రశేఖర్ రావు, వచ్చి జూబిలీ హిల్స్లో ప్రచారం చేస్తే పది ఓట్లు పడేది ఒక్కటి కూడా పడదు అన్నారు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌ను ప్రకటించింది.
వైరల్ వీడియోలో ముగ్గురు మీడియాతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. వారిలో ఒకరు, ఆద్య టీవీతో మాట్లాడుతూ కేసీఆర్ గురించి వైరల్ వ్యాఖ్య చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇతర వ్యాఖ్యలు, ఒక మహిళ, ఇంకో వ్యక్తి లెజెండ్ టీవీతో మాట్లాడుతూ చేసినట్లు చూడవచ్చు.
"ఇక్కడ నవీన్ యాదవ్ గురించి అందరికి తెలుసు. నేను చెప్పాల్సింది ఏమి లేదు. పబ్లిక్‌లో ఏం టాక్ ఉంది, ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మీరు తిరిగి పబ్లిక్‌ని అడిగితేయ్ చెప్తారు. నేను కాదు, అందరు చెప్తారు..." అని మొదటి వ్యక్తి ఆద్య అనే మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ అన్నట్లు చూడవచ్చు. తరువాత మరో ఇద్దరు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని చూడవచ్చు
వీడియో చివరిలో, మొదట మాట్లాడిన వ్యక్తే మళ్ళి మాట్లాడుతూ ఇలా అన్నారు, "నేను చెప్తున్నా కేసీఆర్ సార్ వచ్చి ప్రచారం చేస్తే పది ఓట్లు పడేది ఒక్కటి కూడా పడదు."
వీడియోపై ఇలా రాసి ఉంది, "కేసీఆర్ వస్తే తరిమికొడ్తం ఒక్క ఓటు కూడా పడదు". ఈ వీడియోని షేర్ చేసి చాకిరేవు అనే ఫేస్‌బుక్ పేజీ, ఈ క్యాప్షన్‌తో అప్లోడ్ చేసింది, "కేసీఆర్ పేరు ఎత్తితే జనం కొట్టేలా ఉన్నరు.." (ఆర్కైవ్)
Fact Check
సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వైరల్ వీడియోని ఎడిట్ చేసినట్లుగా ధృవీకరించబడింది.
లెజెండ్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వైరల్ వీడియోకి సంబంధించిన రెండు ఇంటర్వ్యూ క్లిప్స్‌ను గుర్తించాం.
మహిళ మాట్లాడుతూ కనిపించే వీడియో క్లిప్ అక్టోబర్ 29న లెజెండ్ టీవీలో అప్లోడ్ చేయబడింది.
వైరల్ వీడియోలో కనిపించే రెండో వ్యక్తి ఇంటర్వ్యూ క్లిప్ అక్టోబర్ 28న లెజెండ్ టీవీలో అప్లోడ్ చేయబడింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి పరిశీలించగా, మూడవ ఇంటర్వ్యూ వీడియో అక్టోబర్ 28న ఎక్స్‌లో అప్లోడ్ చేయబడినట్లు గుర్తించాం.
వీడియో ‘జూబ్లీహిల్స్ విత్ బీఆర్ఎస్’ అనే ఖాతా “జూబ్లీహిల్స్‌లో కేసీఆర్ సార్ వచ్చి ప్రచారం చేస్తే 10 ఓట్లు పడే చోట 100 ఓట్లు పడుతాయి. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే 10 ఓట్లు పడే చోట ఒక్క ఓటు కూడా పడదు.” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది.
ఈ వీడియోలో వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తే మాట్లాడుతూ ఇలా అన్నారు, "ఇక్కడ కేసీఆర్ సార్ వచ్చేసి ప్రచారం చేస్తున్నారని చెప్పారు సార్ మీకు, మరి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ప్రచారం చేసేది ఏమైనా ఉండ అని అడిగారు... కేసీఆర్ సార్ వచ్చి ప్రచారం చేస్తే 10 ఓట్లు పడేది 100 ఓట్లు పడుతాయి. అదే రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఇక్కడ 10 ఓట్లు పడేది ఒక్క ఓటు కూడా పడదు."
వైరల్ వీడియోను విశ్లేషించగా, "నేను చెప్తున్నా కేసీఆర్ సార్ వచ్చి ప్రచారం చేస్తే" అనే వాక్యానికి తరువాత, "పది ఓట్లు పడేది ఒక్కటి కూడా పడదు" అనే మాటల మధ్య వీడియోలో కట్ ఉన్నట్లు గుర్తించాం. ఈ కట్, ఎక్స్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో లేదు. అయితే వైరల్ వీడియోలో ఉన్న మిగితా రెండు ఇంటర్వ్యూ క్లిప్పులలో కట్స్ లేవని గుర్తించాం.
వైరల్ ఇంటర్వ్యూ వీడియో ‘ఆద్యా టీవీ’ యూట్యూబ్ ఛానెల్‌లో అక్టోబర్ 27న అప్లోడ్ చేయబడినట్లు గుర్తించాం. ఈ వీడియో శీర్షిక, “పాపం నవీన్ యాదవ్.. | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్‌ను పట్టించుకోని ఎంఐఎం నాయకులు | రేవంత్ | ఆద్యా”
ఈ వీడియోలో, ఆద్యా రిపోర్టర్ వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆ వ్యక్తి ఇలా అన్నారు:
"ఇక్కడ నవీన్ యాదవ్ గురించి అందరికి తెలుసు. నేను చెప్పాల్సింది ఏమి లేదు. పబ్లిక్‌లో ఏం టాక్ ఉంది, ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మీరు తిరిగి పబ్లిక్‌ని అడిగితేయ్ చెప్తారు. నేను కాదు, అందరు చెప్తారు. కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ వైపు మాత్రం ఎవ్వరు చూసే పరిస్థితి లేదు."
వీడియోలో 2:34 నిమిషం మార్క్ నుండి 2:53 నిమిషం మార్క్ ఈ వ్యాఖ్య చేసినట్లు చూడవచ్చు.
X వీడియోలో ఉన్నట్లే ఆద్య టీవీ అప్లోడ్ చేసిన వీడియోలో కూడా 3:12 నిమిషం మార్క్ నుండి 3:40 నిమిషం మార్క్ వరకు మాట్లాడుతూ ఇలా అన్నారు.
"ఇప్పుడు మొన్న రిసెంట్‌గా నవీన్ అన్న ఏం అన్నాడంటే ఇక్కడ కేసీఆర్ సార్ వచ్చేసి ప్రచారం చేస్తున్నారని చెప్పారు సార్ మీకు, మరి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ప్రచారం చేసేది ఏమైనా ఉండ అని అడిగారు. క్యూస్షన్ ఇస్తే అయన ఏం మాట్లాడలేదు.. నేను చెప్తున్నా కేసీఆర్ సార్ వచ్చి ప్రచారం చేస్తే 10 ఓట్లు పడేది 100 ఓట్లు పడుతాయి. అదే రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఇక్కడ 10 ఓట్లు పడేది ఒక్క ఓటు కూడా పడదు".
ఆద్య టీవీ షేర్ చేసిన వీడియోలో, ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఎటువంటి కట్స్ లేవు. అయితే, వైరల్ వీడియోని ఎడిట్ చేసి రూపొందించినదిగా తెలుస్తోంది. కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని సౌత్ చెక్ నిర్ధారించింది.