Fact Check: ‘వార్ ఎఫెక్ట్’ వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్సులు, బెల్టులు, టైలు, స్కూల్ బ్యాగులు ఇవ్వరు? నిజమేంటంటే..

‘వార్ ఎఫెక్ట్’ కారణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్సులు, బెల్టులు, టైలు, స్కూల్ బ్యాగులు ఇవ్వబోరని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.
A post claiming that shoes, socks, belts, ties and school bags will not be provided to government school students due to the “war effect” is being widely shared on social media.
Published on
2 min read

హైదరాబాద్: వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోతో కూడిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వార్ ఎఫెక్ట్’ కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్సులు, బెల్టులు, టైలు, స్కూల్ బ్యాగులు ఇవ్వబోమని ప్రభుత్వం నిర్ణయించిందని పోస్టులో పేర్కొన్నారు.(Archive)

A post claiming that shoes, socks, belts, ties and school bags will not be provided to government school students due to the “war effect” is being widely shared on social media.

ఫ్యాక్ట్ చెక్

సౌత్ చెక్ పరిశీలనలో వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పుదారి పట్టించేదిగా తేలింది. ప్రభుత్వం అలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు కూడా అలాంటి ప్రకటన చేయలేదు.

అధికారిక ఉత్తర్వులు లేవు

వైరల్ అవుతున్న క్లెయిమ్‌పై స్పష్టత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, ప్రకటనలు, నోటిఫికేషన్లు పరిశీలించాము. అయితే విద్యార్థులకు స్కూల్ కిట్లు నిలిపివేసినట్లు ఎలాంటి అధికారిక పత్రం లేదా విశ్వసనీయ వార్తా కథనం మాకు లభించలేదు.

సౌత్ చెక్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులను కూడా సంప్రదించింది.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం పూర్తిగా తప్పని, అలాంటి ఉత్తర్వులు ఏవీ జారీ కాలేదని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ కొనసాగుతుందని చెప్పారు.

జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తప్పకుండా అందజేస్తామని స్పష్టం చేశారు.

ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఏమంది?

ఈ అంశంపై అధికారిక AP Fact Check X ఖాతాలో కూడా వివరణ ఇచ్చారు.

‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లను పూర్తిగా నిలిపివేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా ఇబ్బందుల కారణంగా యూనిఫాం క్లాత్, బ్యాగులు, షూల సరఫరాలో కేవలం స్వల్ప ఆలస్యం మాత్రమే ఉంటుందని తెలిపారు. విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

అధికారులు తయారీ సంస్థలతో సమన్వయం చేస్తూ సరఫరా ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.

కాబట్టి, ‘వార్ ఎఫెక్ట్’ కారణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్సులు, బెల్టులు, టైలు, స్కూల్ బ్యాగులు ఇవ్వబోరన్న వైరల్ క్లెయిమ్ తప్పు.

logo
South Check
southcheck.in