నిజమెంత: పాకిస్తాన్ కు చెందిన వీడియోను విజయవాడలో వరదల విజువల్స్‌గా తప్పుడు ప్రచారం చేశారు

భారీ వర్షాలతో పాటూ కృష్ణా నది పొంగి పొర్లడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు చుట్టుపక్కల జిల్లాలలో వరదలు సంభవించాయి.
నిజమెంత: పాకిస్తాన్ కు చెందిన వీడియోను విజయవాడలో వరదల విజువల్స్‌గా తప్పుడు ప్రచారం చేశారు
Published on
2 min read

భారీ వర్షాలతో పాటూ కృష్ణా నది పొంగి పొర్లడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు చుట్టుపక్కల జిల్లాలలో వరదలు సంభవించాయి. తీవ్రమైన వర్షపాతం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రోజువారీ జనజీవనానికి అంతరాయం కలిగించింది. గణనీయమైన ఆస్తి నష్టం జరిగింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా మొత్తం 4,15,171 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ముఖ్యంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఈ నేప‌థ్యంలో నీటిలో చాలా మంది మనుషులను చూపించే ఏరియ‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కరకట్టలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండేందుకు బుడమేరు నది గేట్లు తెరిచారని, దీంతో విజయవాడ వరద ముంపునకు దారితీసిందని పలువురు పోస్టులు పెట్టారు.

ఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను షేర్ చేస్తూ, “వరద ముప్పు తగ్గిన తర్వాత బుడమేరు గురించి చాలా చర్చ జరగాలి. కరకట్ట కొంప భద్రత దృష్ట్యా బుడమేరు గేట్లు తెరిచినట్లు చర్చ...అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద పరాజయం ఆయనదే (చంద్రబాబు నాయుడు)…” అంటూ పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

వీడియో పాతది. ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని Southcheck కనుగొంది.

మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ నుండి ఈ వైరల్ పోస్టుకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చింది. బుడమేరు నదికి గేట్లు లేవని, గట్టు భద్రత కోసం లేదా నిరోధించడానికి గేట్లు తెరిచారనే వాదనలను ఖండిస్తూ పోస్ట్ స్పష్టం చేసింది. బుడమేరు కృష్ణా నదికి ఆనుకుని ఉండగా, మరో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉందని పోస్ట్‌లో తెలిపారు.

"కరకట్ట సేఫ్టీ కోసమో... ముఖ్యమంత్రి ఇల్లు మునగకుండా ఉండటం కోసమో బుడమేరు గేట్లు తెరిచారని కొందరు చేస్తున్న ప్రచారం అర్థరహితం. పూర్తిగా అవాస్తవం. బుడమేరుకు ఎక్కడా గేట్లు లేవు. అదీకాకుండా బుడమేరు కృష్ణానదికి ఈ పక్కన ఉంటే, సీఎం ఇల్లు ఆ పక్కన ఉంటుంది. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి పుకార్లని నమ్మకండి #AndhraPradesh" అంటూ ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ పోస్టు పెట్టింది.

వీడియో కీఫ్రేమ్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని థాట్టా జిల్లాలో కర్లీ లేక్‌గా గుర్తించారు. అదే లొకేషన్‌తో అనేక Facebook ఖాతాల ద్వారా జూలై 2024లో చేసిన పోస్ట్ లను మేము కనుగొన్నాము.

జూలై 15న అదే వీడియోను పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ పేజీ "వెదర్ అప్‌డేట్స్ కరాచీ" అడ్మిన్ నవీద్ ఖత్రీ, కర్లీ సరస్సులో ప్రజలు తమ సమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు వీడియోలో ఉందని న్యూస్‌మీటర్‌కు ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ, “వీడియో దాదాపు 2-3 నెలల పాతది. కర్లీ సరస్సు ఒక పిక్నిక్ స్పాట్, కరాచీ, పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల నుండి ప్రజలు మే నుండి ఆగస్టు నెల వరకు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు." అని తెలిపారు.

సమాచారాన్ని మరింత ధృవీకరించడానికి, మేము యూట్యూబ్‌లో కర్లీ సరస్సు వీడియోల కోసం సెర్చ్ చేశాం. జూన్ 16, 2022న పాకిస్తానీ ఛానెల్ 'చల్టే ఫిర్టే' లో అప్‌లోడ్ చేసిన వీడియో బ్లాగ్‌ని మేము కనుగొన్నాము. ఈ బ్లాగ్‌లో సరస్సులో స్నానం చేస్తున్న వ్యక్తులు, బోటింగ్ ఫుటేజీలు ఉన్నాయి. సరస్సు ఒడ్డున అనేక టెంట్ హౌస్‌లు వైరల్ వీడియోలో కూడా కనిపిస్తాయి. ఈ టెంట్ హౌస్‌లు సందర్శకులకు అద్దెకు అందుబాటులో ఉంటాయి.

కాబట్టి, ఆ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in