Fact Check: వైరల్ అవుతున్న వీడియో గాజియాబాద్ ఘటనకు సంబంధించినది కాదు

ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగిన సూర్య ప్రతాప్ హత్యకేసుతో ముడిపెట్టి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Fact Check: వైరల్ అవుతున్న వీడియో గాజియాబాద్ ఘటనకు సంబంధించినది కాదు
Published on
2 min read

Hyderabad: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో మే 28న 17 ఏళ్ల సూర్య ప్రతాప్‌ను అసద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యకేసుతో ముడిపెట్టి ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో పోలీసులు ఇద్దరిని పట్టుకుని తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. వారి చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉండగా, వారు కుంటుకుంటూ నడుస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇది గాజియాబాద్‌లో జరిగిన సూర్య హత్యకేసు నిందితులదేనని దావా చేస్తున్నారు.

ఈ వీడియోని ఒక ఫేస్‌బుక్ యూజర్ షేర్ చేసి ఇలా రాశారు, "యూపీ గాజియాబాద్‌ సూర్య కేసులో ఒకరు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఏ కీలు కాకీలు విరిచేసి సంకెళ్లతో బంధించి, బొక్కలో వేశారు.. ఈ కొడుకులు కూడా త్వరలో ఎన్కౌంటర్లో పోతారు"

Fact Check

సౌత్ చెక్ ఈ దావా తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్న వీడియోకి గాజియాబాద్ ఘటనకు సంబంధం లేదు.

వీడియో కీ ఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ వైరల్ వీడియో ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌లో కనిపించింది. ఈ వీడియోను ఏప్రిల్ 8, 2026న షేర్ చేశారు. అందులోని వివరాల ప్రకారం, ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చెందినది. గాంధీ చౌరాహాలో ఒక వ్యక్తిని కత్తితో హత్య చేసిన కేసులో పోలీసులు నిందితులను పట్టుకుని వారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కీవర్డ్స్‌తో సెర్చ్ చేశాం. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఒక వీడియోను కనుగొన్నాం. ఈ వీడియోను ఏప్రిల్ 9, 2026న షేర్ చేశారు. అందులోని కథనం ప్రకారం, ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చెందినది. ఇది 19 ఏళ్ల అరుణ్ హత్యకేసుకు సంబంధించిన ఘటన.

ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ మరిన్ని వార్త కథనాలు దొరికాయి, అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాలు ఏప్రిల్ 6, 2026న ప్రచురితమయ్యాయి. వాటి ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ గాంధీ చౌరాహాలో 19 ఏళ్ల అరుణ్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. వ్యక్తిగత వైరం కారణంగా రోహిత్ భాటి, యువరాజ్ మాలి అనే ఇద్దరు యువకులు అరుణ్‌పై కత్తులతో దాడి చేశారు. 

అనంతరం అరుణ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హత్యపై ఆగ్రహించిన స్థానికులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అనంతరం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

అసలు గాజియాబాద్‌లో ఏం జరిగింది?

గాజియాబాద్‌లోని ఖోఢా పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిగత వైరం కారణంగా మే 28, 2026న సూర్య ప్రతాప్‌ను కత్తితో దారుణంగా హత్య చేశారు. అసద్, సూర్య మధ్య గొడవ జరిగింది. ఈ విషయం అసద్ తన తండ్రికి చెప్పగా, సూర్యకు గుణపాఠం చెప్పాలని అతని తండ్రి సూచించినట్లు సమాచారం. అనంతరం అసద్ తన అనుచరులతో కలిసి సూర్యను హత్య చేశాడు. ఈ కేసులో కుట్రలో భాగమైన ప్రధాన నిందితుడి తండ్రి నవాబ్, ఫర్హాన్, అతీఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ మరణించాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవొచ్చు.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో గాజియాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించినది కాదు అని స్పష్టమైంది. సౌత్ చెక్ వైరల్ దావా తప్పు అని నిర్ధారించింది.

logo
South Check
southcheck.in