Fact Check: దుబాయ్ అపార్ట్‌మెంట్ నుంచి మహిళ లైవ్ స్ట్రీమ్ సమయంలో ఇరాన్ క్షిపణి దాడి? లేదు, ఇదే అసలు నిజం

ఇరాన్ క్షిపణి దాడికి క్షణాల ముందు దుబాయ్‌లోని తన అపార్ట్‌మెంట్ నుంచి ఒక మహిళ లైవ్ స్ట్రీమ్ చేస్తుండగా జరిగిన పేలుడు దృశ్యాలంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A video claiming to show a woman livestreaming from her apartment in Dubai moments before it was hit by an Iranian missile is being widely shared on social media.
Published on
2 min read

హైదరాబాద్: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో మరింత పెరిగాయి. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియోలో ఒక మహిళ తన అపార్ట్‌మెంట్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను దుబాయ్‌లో ఇరాన్ క్షిపణి దాడి జరిగిన క్షణాల ముందు జరిగిన ఘటనగా పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “యుఏఈలోని నివాస సముదాయాలపై ఇరాన్ క్షిపణి దాడులకు తెగబడుతోంది. ఓ ఫిలిప్పీన్స్ మహిళ లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా, ఆమె అపార్ట్‌మెంట్‌పై మిస్సైల్ పడి ఇల్లు ధ్వంసమైన వీడియో వైరల్‌గా మారింది. ఆర్మీ బేస్‌లతో పాటు వాణిజ్య కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో UAE, సౌదీ అరేబియా నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు” అని క్యాప్షన్ ఇచ్చారు.(Archive)

ఇలాంటి పోస్టులు మరికొన్ని పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.(Archive1, Archive2)

ఫ్యాక్ట్ చెక్

సౌత్ చెక్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. వైరల్ వీడియో దుబాయ్‌లో జరిగిన ఘటనకు సంబంధించినది కాదు. ఇది లెబనాన్‌లో జరిగిన బీరూట్ పోర్ట్ పేలుడు సమయంలో తీసిన పాత వీడియో.

విజువల్స్ పరిశీలన

వైరల్ వీడియోలోని ముఖ్య ఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2020 ఆగస్టు 6న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఒక లైవ్ స్ట్రీమ్ వీడియో దొరికింది. లెబనాన్‌లో పనిచేసే ఫిలిప్పీన్స్‌కు చెందిన విదేశీ కార్మికురాలు ఎడ్లిన్ కాండిడో లాక్‌సే ఈ వీడియోను “Blast while I'm on my streaming” అనే శీర్షికతో అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోలోని దృశ్యాలు అదే వీడియోతో సరిపోలాయి.

2020 ఆగస్టు 4న లెబనాన్ రాజధాని బీరూట్ పోర్ట్ వద్ద సుమారు 2,750 టన్నుల అమోనియం నైట్రేట్ పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడు చిన్న పరిమాణ అణు బాంబు స్థాయి ప్రభావాన్ని చూపింది. ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. నగరంలోని అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వైరల్ వీడియోలో కనిపించే మహిళ తన అపార్ట్‌మెంట్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తుండగా, ఆకస్మికంగా సంభవించిన పేలుడు శబ్దానికి భయంతో స్పందిస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ సమయంలో పేలుడు ప్రభావం నేపథ్యంలో కనిపించడం లేదా వినిపించడం జరుగుతుంది.

ఇక 2026 మార్చి 3న ఎడ్లిన్ కాండిడో లాక్‌సే తన ఫేస్‌బుక్ ఖాతాలో స్పష్టత ఇచ్చారు. “ఆ వీడియోలో ఉన్నది నేనే. అది 2020లో లెబనాన్‌లో జరిగిన ఘటన. ప్రస్తుతం నేను సురక్షితంగా ఫిలిప్పీన్స్‌లో ఉన్నాను. కొంతమంది బ్లాగర్లు ఈ వీడియోను టిక్‌టాక్‌లో మళ్లీ పోస్ట్ చేస్తున్నారు,” అని ఆమె పేర్కొన్నారు. 

Summary

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దుబాయ్‌లో ఇరాన్ క్షిపణి దాడి జరిగిన సమయంలో తీసినది కాదు. ఇది 2020 ఆగస్టు 4న లెబనాన్‌లో జరిగిన బీరూట్ పోర్ట్ పేలుడు సమయంలో రికార్డైన పాత వీడియో.

అందువల్ల ఈ క్లెయిమ్ తప్పు.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in