Fact Check: ముంబైలో చలాన్ జారీ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులను కొట్టారా? కాదు, ఈ ఘటన 2015 ఢిల్లీలో జరిగింది 
Telugu

Fact Check: ముంబైలో చలాన్ జారీ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులను కొట్టారా? కాదు, ఈ ఘటన 2015 ఢిల్లీలో జరిగింది

ట్రాఫిక్ కానిస్టేబుళ్లపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తున్నట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది 2025 మార్చి 19న ముంబైలో జరిగిందని క్లెయిమ్ చేస్తున్నారు.

Sherly

Hyderabad: ఇద్దరు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్లపై కొంతమంది వ్యక్తులు దాడిచేయడాన్ని చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యూనిఫారంలో ఉన్న కానిస్టేబుల్‌ను కొట్టి, తర్వాత ఇంకొక కానిస్టేబుల్‌ పారిపోతుంటే అతన్ని రోడ్డుపై నెట్టి దాడి చేసినట్లు కనిపిస్తుంది. ఈ ఘటనలో దాడికి పాల్పడ్డ వారి కొందరు తలపై టోపీలు ధరించినట్లు కనిపిస్తున్నారు.

ఈ ఘటన 19 మార్చి 2025న ముంబైలో జరిగిందన్న క్లెయిమ్‌లతో వైరల్ అవుతోంది. ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసి దేశం బయటి నుండి కంటే లోపల నుండే ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది అని పేర్కొంటూ హిందువులు అందరు భారతీయ జనతా పార్టీకే (బిజెపి) ఓటు వెయ్యాలి అని అన్నారు.

వైరల్ అవుతున్న వీడియోని షేర్ చేసి, శీర్షికలో ఈ విధంగా రాశారు, "ఈ రోజు ముంబైలో @ పోలీసులు చలాన్ జారీ చేసినప్పుడు, ముస్లింలు వారిని కొట్టారు. ఇది చట్టానికి సవాలు. భవిష్యత్తులో భారతదేశంలో ఏం జరుగుతుందో ఈ వీడియో చెబుతోంది. దేశాన్ని ఎవరు నడిపిస్తారు? మరి అందరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? చేదు నిజం ఏమిటంటే, దేశం బయటి నుండి కంటే లోపల నుండి ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. మిత్రులారా, మానవత్వంతో, ఈ వీడియోని ప్రతి గ్రూప్‌కి పంపవలసిందిగా ముకుళిత హస్తాలతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది రేపు సాయంత్రంలోగా ప్రతి న్యూస్ ఛానెల్‌లో కనిపించాలి*.నువ్వు ఓటు బ్యాంకు గా ఐకమత్యం గా ఉండాల్సిన సమయం.. చరిత్ర తెలుసుకో ఎడారి మతాల ఉన్మాద్ధం తెలుసుకో విడిపోతే పడిపోతాము.. ఐక్యత ఒకటే రక్ష కఠిన చట్టాలు కావాలి తేవాలి అంటే బీజేపీకి ప్రతి హిందువు ఓటు వెయ్యండి"

ఈ పోస్టు ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.

Fact Check:

సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది అని గుర్తించింది. వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న సంఘటన ఇటీవల జరిగింది కాదు. ఇది 2015లో ఢిల్లీలో జరిగింది.

వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ సెర్చ్ ద్వారా, ABP News యూట్యూబ్ ఛానెల్‌లో 2015 జులై 13న, 'వైరల్ వీడియో: ట్రాఫిక్ ఉల్లంఘనులు తమ విధిని నిర్వర్తించినందుకు ఢిల్లీ పోలీసులను ఎలా కొట్టారో చూడండి' అనే శీర్షికతో అప్లోడ్ చేయబడిన వీడియో దొరికింది.

వీడియో వివరణ ప్రకారం, హెల్మెట్ లేకుండా, ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నపుడు ఈ ఘటన చోటు చేసుకుంది. "ఆపిన వెంటనే హెడ్ కానిస్టేబుల్ జై భగవాన్‌పై దాడి చేసి, తర్వాత కానిస్టేబుల్ మనోజ్ మీద దాడి చేశారు," అని రాశారు.

NDTV India కూడా యూట్యూబ్‌లో ఈ ఘటనపై వార్తను ప్రసారం చేశారు. ఈ వీడియో 14 జూలై 2015న, "ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసిన దుడగులు" అనే శీర్షికతో అప్‌లోడ్ చేయబడింది.

హెల్మెట్ లేకుండా, ముగ్గురు వ్యక్తులు ఒకే ద్విచక్రవాహనం మీద ప్రయాణిస్తుండగా పోలీసులు ఆపినందుకు వారి మీద దాడి జరిగింది అని రాశారు.

ఈ సంఘటనపై Deccan Herald, Times of India, Zee News కూడా కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు, ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో 2015 జూలై 13న ట్రాఫిక్ చలాన్ జారీ చేసినందుకే కానిస్టేబుళ్లు జై భగవాన్, మనోజ్ లపై దాడి జరిగిందని ధృవీకరిస్తున్నాయి. దాడికి పాల్పడిన షానవాజ్, అమీర్, సగిర్ అహ్మద్‌లను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేశారు అని తెలుస్తోంది.

కాబట్టి, వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని సౌత్ చెక్ నిర్ధారించింది.

Fact Check: Pro-Palestine march in Kerala? No, video shows protest against toll booth

Fact Check: ഓണം ബംപറടിച്ച സ്ത്രീയുടെ ചിത്രം? സത്യമറിയാം

Fact Check: கரூர் கூட்ட நெரிசலில் பாதிக்கப்பட்டவர்களை பனையூருக்கு அழைத்தாரா விஜய்?

Fact Check: Christian church vandalised in India? No, video is from Pakistan

Fact Check: ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 1 ಸಿನಿಮಾ ನೋಡಿ ರಶ್ಮಿಕಾ ರಿಯಾಕ್ಷನ್ ಎಂದು 2022ರ ವೀಡಿಯೊ ವೈರಲ್